నందికొట్కూరు,
తేది: 27/07/2026.
ఖరీఫ్ రైతులను కరువు కష్టాల నుంచి ఆదుకోవాలి…నందికొట్కూరు సబ్-డివిజన్ను కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వానికి వినతి
నందికొట్కూరు వ్యవసాయ సబ్-డివిజన్ పరిధిలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను కరువుగా ప్రకటించి రైతులను తక్షణమే ఆదుకోవాలని సి.పి.ఐ.(ఎం.ఎల్.) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో నందికొట్కూరు వ్యవసాయ సహాయ సంచాలకులు (రెగ్యులర్) గిరీష్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో నందికొట్కూరు, మిడుతూరు, జూపాడుబంగ్లా, పగిడ్యాల మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విత్తిన విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకెత్తిన పంటలు తేమ లేక ఎండిపోవడం, రైతులు రెండోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడి భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్-డివిజన్ పరిధిలో సాధారణంగా 33 వేల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా, వర్షాభావం కారణంగా కేవలం 16,500 హెక్టార్లలో మాత్రమే (సుమారు 50 శాతం) సాగు జరిగిందని తెలిపారు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈ సీజన్లో కేవలం 54 శాతం వర్షపాతం మాత్రమే నమోదైందని, పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాలుగు మండలాలను వెంటనే కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించాలని, ప్రత్యేక బృందాలతో పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, నష్టపరిహారం, ఉచిత విత్తనాలు, ఎరువులు అందించాలని కోరారు. అదేవిధంగా వ్యవసాయ రుణాల మాఫీ, పంట రుణాల రీషెడ్యూల్, పంట బీమా నష్టపరిహారం, పశువులకు మేత శిబిరాలు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి, అత్యవసర సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ నందికొట్కూరు మండల కార్యదర్శి కాటేపోగు సోమన్న అవును కార్యదర్శి మండల రామకృష్ణ మిడుతూరు మండల కార్యదర్శి మేకల చంద్రశేఖర్ రైతు సంఘం నాయకులు వడ్డే సుధాకర్ ఏబీఎన్ పాలెం సుధాకర్ రాముడు కొండలయ్య తదితరులు పాల్గొన్నారు
