.
పగిద్యాల, నెహ్రూనగర్ (నందికొట్కూరు న్యూస్ ప్రతినిధి పగడం గోపి )నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పౌర్ణిమ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు సామాజిక సేవకుడు గుజ్జుల గౌరీశ్వర నాయుడు అతిథిగా హాజరై పూజలో పాల్గొని అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువును కేవలం పూజించడం మాత్రమే కాకుండా, గురువు బోధించిన ఆదర్శాలను జీవితంలో ఆచరించడమే నిజమైన గురుభక్తి అని అన్నారు. శ్రీ సాయిబాబా బోధించిన “శ్రద్ధా–సబూరి” సిద్ధాంతాలు ప్రతి మనిషి జీవితానికి దిక్సూచిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రేమ, సేవ, కరుణ, మానవత్వం వంటి విలువలను అలవర్చుకొని సమాజంలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. గురు పౌర్ణిమ సందర్భంగా ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని, శ్రీ సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు పిట్టల గంగన్న, జంపుల వెంకటేశ్వర్లు, గుండపోలు రవీంద్రారెడ్డి, మంగలి దామోదర్, సురేష్ గుప్తా తదితరులను ఆయన అభినందించారు. మహోత్సవానికి సహకరించిన దాతలను నిర్వాహకులు ప్రత్యేకంగా కొనియాడారు. సప్లయర్ సామాన్ల దాత రవీంద్రగాడు, పాయసం దాత కీర్తిశేషులు గోపాలు సంస్మరణార్థం వారి కుటుంబ సభ్యులు, గొల్ల మౌలాలి, డెకరేషన్ దాత కట్టుబడి యూత్, అన్నదాతలుగా నెహ్రూనగర్, ముచ్చుమర్రి, కొణిదేల, నాగటూరు గ్రామాల ప్రజలు, పూల దాత సూగూరు నాగార్జున, పెరుగన్నం దాత జంపుల శ్రీనివాసులు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సాయిబాబా సేవా సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురు పౌర్ణిమ మహోత్సవాలను నెహ్రూనగర్ శ్రీ సాయిబాబా సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి భక్తి, శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

