Srisailam New Sparsha Darshan Rules: శ్రీశైలంలో స్పర్శ దర్శనాలకు సంబంధించి కీలక మార్పులుచేశారు. వీకెండైన శని, ఆదివారాలతో పాటుగా సోమవారం వీఐపీ బ్రేక్ స్పర్శ దర్శనాలు ఉదయం కాకుండా రాత్రి 9 గంటల సయమంలో కల్పిస్తారు. ఈ మూడ రోజుల్లో మనమిత్ర వాట్సాప్, ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు తీసుకున్న భక్తులకు ఉదయం 7.30 గంటలకు స్పర్శదర్శనం కొనసాగుతుంది అంటున్నారు. వారాంతంలో భక్తులరద్దీ అధికంగా ఉండడంతో సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

హైలైట్:
శ్రీశైలం మల్లన్న దర్శనాల రూల్స్ మార్పు
ఉదయం స్పర్శ దర్శనాలపై క్లారిటీ ఇచ్చారు
వారికి మాత్రం ఉదయం కాకుండా రాత్రి దర్శనం.

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. కొంతకాలంగా రద్దీ పెరగడంతో స్పర్శ దర్శన విధానంలో కీలక మార్పులు చేసినట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇకపై ప్రతి శని, ఆది, సోమవారాల్లో ఉదయం వేళల్లో మనమిత్ర వాట్సాప్, ఆన్‌లైన్ ద్వారా ముందుగానే స్పర్శ దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఒకవేళ ఎవరైనా ప్రముఖులు స్వయంగా ఆలయానికి వస్తే కనుక.. ఆ సందర్భంలో ప్రాధాన్యతను బట్టి ఉదయం స్పర్శ దర్శనం కల్పిస్తామన్నారు.

ఈ మూడు రోజుల్లో ఉదయం వేళల్లో సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సిఫార్సు లేఖలతో వచ్చేవారికి అవకాశం ఉన్నంత వరకు రాత్రి 9 గంటల సమయంలో స్పర్శ దర్శనానికి అనుమతిస్తామన్నారు. అలాగే సర్వదర్శనం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం ద్వారా వచ్చే భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీశైలంలో భక్తుల సౌకర్యం, రద్దీ నియంత్రణను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేశామన్నారు. ఈ మేరకు భక్తులు ఈ కొత్త నిబంధనలను గమనించి సహకరించాలని కోరారు.

శ్రీశైలం ఆలయంలో పాలకమండలి ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన క్యూలైన్స్, విరాళాల కేంద్రాన్ని, దర్శనం టికెట్ల కేంద్రాలను పరిశీలించారు.. భక్తులకు దర్శనం కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యూలైన్లలో తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దర్శనం క్యూ లైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని.. భక్తుల రద్దీ సమయంలో, వీకెండ్, ఇతర సెలవుల సమయంలో క్యూలైన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. క్యూలైన్లలో భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందిస్తుండాలన్నారు. అంతేకాదు భక్తులతో కూడా ఆలయ ఛైర్మన్ మాట్లాడారు.

మరోవైపు శ్రీశైలం – హైదరాబాద్ మెయిన్ రోడ్డుపై పెద్దపులి సంచారం కలకలం రేపింది. నల్లమల అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్డుపై పులి రోడ్డు దాటుతుండగా వాహనదారులు గమనించారు.. వారు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రాత్రి సమయాల్లో శ్రీశైలం వెళ్లే భక్తులు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.