బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం, దానికి అనుబంధంగా ఉన్న రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా రాగల మూడు రోజుల పాటు వాతావరణం మారనుంది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో మధ్యప్రదేశ్ వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఉత్తర కోస్తాలో భారీ వర్ష సూచన
తీవ్ర వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర ,యానాం ప్రాంతాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడటంతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాగల రెండు రోజులు కూడా కొన్ని చోట్ల మోస్తరు జల్లులు పడే అవకాశముంది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
దక్షిణ కోస్తాలో వర్షాలు.. గాలుల హోరు
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రాబోయే రెండు రోజులు (బుధ, గురువారాలు) అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. అయితే, తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాయలసీమ వ్యాప్తంగా వాతావరణ సూచన
రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రేపు, ఎల్లుండి కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు. రాయలసీమ వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్పష్టం చేశారు.
