మతం మారితే తక్షణమే ఎస్సీ హోదా రద్దవుతుందన్న సుప్రీంకోర్టు

హిందూ, సిక్కు, బౌద్ధ మతస్తులు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని వ్యాఖ్య

మతం మారితే ఎస్సీ ప్రయోజనాలు కోల్పోతారని స్పష్టీకరణ

షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గానికి చెందిన వ్యక్తి ఇతర మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా తక్షణమే రద్దవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను కాదని క్రిస్టియానిటీ లేదా ఇతర మతాలను స్వీకరించిన వ్యక్తులకు ఎస్సీ రిజర్వేషన్లు, కుల ధ్రువీకరణ పత్రాలు చెల్లవంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం… హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని, మతం మారిన మరుక్షణమే ఎస్సీ హోదా, దాని ఆధారిత ప్రయోజనాలు ముగుస్తాయని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి పొరపాటు లేదని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. పునఃపరిశీలన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఒకవేళ ఎవరైనా తిరిగి ఎస్సీ హోదాను పొందాలంటే… రాజ్యాంగం నిర్దేశించిన మూడు ప్రధాన నిబంధనలకు (పుట్టుకతో ఎస్సీ అయి ఉండటం, స్వచ్ఛందంగా తిరిగి సొంత మతంలోకి రావడం, మూల కుల సమాజం వారిని ఆమోదించడం) కట్టుబడి ఉండాలని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ కీలక తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ విధానాలు, మత మార్పిడి వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.